మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్!

TPCC క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసుకు మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వివరణ ఇచ్చారు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం.. వివరణ కోరడం సరి కాదన్నారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని మంత్రి కోరారు. తన వివరణతో కూడిన లేఖను క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి (Mallu Ravi)కి కొండా సురేఖ పంపించారు.

ఆగస్టు 19న CM రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmitha) చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో TPCC క్రమశిక్షణ కమిటీ బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖకి షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి సూచించారు. ఈ క్రమంలోనే నిన్న మంత్రి వివరణ ఇచ్చారు. నోటీసును ఉపసంహరించుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని మంత్రి కోరారు.

TPCC క్రమశిక్షణ కమిటీ రేపు సమావేశం అయ్యే అవకాశం ఉంది. మంత్రి వివరణపై TPCC క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Previous articleజిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీపై బొత్స కీలక ప్రకటన