తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా, ప్రకృతి ప్రేమకు ప్రతిరూపంగా, మహిళల ఐక్యతకు నిదర్శనంగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
🌟 తొమ్మిది రోజుల పాటు ప్రకృతి ఒడిలో విరబూసే రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజిస్తూ, ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పూల పండుగ తెలంగాణ ప్రజల జీవనశైలికి, సాంస్కృతిక వైభవానికి అద్దం పడుతుందని ముఖ్యమంత్రి వివరించారు.
🌟 బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు.. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి, మహిళల ఐక్యతకు, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, మన సంస్కృతీ సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక అని సీఎం తెలిపారు. తరతరాలుగా మన పూర్వీకులు అందించిన ఈ అపురూపమైన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు.
🌟 ఈ సద్దుల బతుకమ్మ ప్రతి ఇంటా సంతోషాల పూలు పూయించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని, తెలంగాణ ఆడపడుచుల జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం నిండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి వైభవం దశదిశలా విరాజిల్లుతూ, మన సంప్రదాయాల పరిమళం తరతరాల పాటు విస్తరించాలని అభిలషించారు.