కరోనా మహమ్మారి సంపన్నుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా అటాక్ చేస్తుందోనని కొందరు ధనికులు హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉంటామో, పోతామో అని టెన్షన్ పడుతున్నారు. సామాన్యుల పరిస్థితి పక్కన పెడితే సంపన్నులు మరీ ఎక్కువగా భయపడుతున్నారు. ఈ భయమే కార్పోరేట్ ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నది. బెడ్ల బుకింగ్ వంటి ఆఫర్లతో సంపన్నులకు వల వేస్తున్నాయి. కరోనా భయం కమ్మేస్తున్న నేపథ్యంలో కొందరు సంపన్నులు కూడా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల ఆఫర్లను క్యాష్ చేసుకుంటూ ముందే బెడ్లను బుక్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో సుమారు 2500 బెడ్లు ఉన్నా..బెడ్లు లేవనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. పలువురు బెడ్లు దొరక్క చనిపోయారన్న వార్తలు వింటున్న బడాబాబులు ముందే అలర్ట్ అవుతున్నారు. తమకు ఒకవేళ కరోనా వస్తే సమయానికి బెడ్ దొరకదు కాబట్టి 5 లక్షలు అడ్వాన్స్ చెల్లించి బెడ్లను బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లోని పలు ఆస్పత్రుల్లో ఈ తరహా ఆఫర్లు ఉన్నట్లు సమాచారం. అలాంటివాళ్లకు నిజంగా పాజిటివ్ వచ్చినా.. 20 నుండి 25 లక్షలు బిల్ వేసినా పెద్దగా పట్టింపులేకపోవడంతో పెద్దలకే ఫస్ట్ ఛాయిస్ అంటున్నాయి కార్పోరేట్ ఆస్పత్రులు.
ఇక కాసులకక్కుర్తిలో పడ్డ ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులకు మాత్రం నోబెడ్ అంటున్నాయి. ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడిచేయకపోవడంతో వారిది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా ఉంటుంది..బయట నోబెడ్స్ అంటారు. బెడ్ లేక వైద్యం అందక ఆస్పత్రి ముందు ప్రాణాలు కోల్పోయినా కనికరం లేనట్లుగా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రులకు కావాల్సింది డబ్బు. అందుకే డబ్బున్నవాళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాయి. పైసలు లేని వాళ్లు మాత్రం పాట్లు పడాల్సిందే.