TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును రేపో, మాపో ప్రకటించే అవకాశం ఉందా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. TPCC కొత్త చీఫ్‌గా రేవంత్ రెడ్డి వైపే పార్టీ అధిష్టానం కూడా మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్ నుంచి అధిష్టానం తెప్పించుకున్న సమాచారం ప్రకారం రేవంత్‌కే పార్టీ పగ్గాలు ఇవ్వాలని మెజార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది.
TPCC రేసులో ఉన్న నేతలు తమ వంతుగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న నేతల్లో పలువురు ఇంచార్జ్ ఠాగూర్‌ను కలిసి చర్చించారు. ఎంపీ కోమటి రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఠాగూర్‌తో వేర్వేరుగా సమావేశమయ్యారు. అలాగే ఠాగూర్‌తో సమావేశమైన పలువురు సీనియర్లు అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది.
TPCC చీఫ్‌గా రేవంత్‌ను ప్రతిపాదించడంపై అధిష్టానం వద్ద కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయ సాధన కోసం సీనియర్ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. చివరి క్షణంలో ఏదైనా జరిగితే తప్ప.. TPCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించడం ఖాయమంటున్నారు.