KCR 2.O: గేర్ మార్చిన గులాబీ బాస్.. తొలి రోజే దుమ్ము లేపిన కేసీఆర్

0
గులాబీ బాస్ కేసీఆర్ గేర్ మార్చారు. దసరా పండుగ తర్వాత రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అచ్చంపేట నుంచి ప్రారంభించారు. అచ్చంపేట ఆశీర్వాద సభలో ప్రసంగించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.. కాంగ్రెస్ నేతల హామీలు, సవాళ్లకు కౌంటర్లు ఇస్తూ దుమ్ములేపారు.

నవంబరు 30న దుమ్ములేపాలి..

మొదటగా కొడంగల్‌లో పోటీ చేయాలన్న రేవంత్ రెడ్డి సవాల్‌ను ప్రస్తావించిన కేసీఆర్.. ఇప్పుడు కొందరు దమ్ముందా.. నువ్వు కొడంగల్‌కు రా.. నువ్వు గాంధీ బొమ్మ దగ్గరికి రా అని సవాళ్లు విసురుతున్నారు. కేసీఆర్‌ దమ్ము సంగతి దేశం మొత్తం చూసింది. నువ్వేం చూడాలి? ఎదురున ఉన్న మీరంతా కేసీఆర్‌ దమ్ము కాదా? ఈ దమ్ము గట్టిగా పైకిలేస్తే దుమ్ము దుమ్ము లేవదా.. నవంబరు 30న దుమ్ము రేగాలన్నారు.

24 గంటల కరెంట్ కావాలా.. ?

ఇక 24 గంటల కరెంట్ అంశాన్ని ప్రస్తావించిన కేసీఆర్.. కాంగ్రెస్ నేతలు 3 గంటలు కరెంట్ ఇస్తామంటున్నారు. సరిపోతదా.. మూడు గంటలు కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా అని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్లు చేతులు ఎత్తాలని కేసీఆర్ కోరారు. ఆశీర్వాద సభకు తరలివచ్చిన ప్రజలు చేతులు పైకి ఎత్తి కేసీఆర్‌కు మద్దతు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని విమర్శించారు. మాట తప్పే వాళ్లెవరో.. నిలబెట్టుకునే వాళ్లేవరో ఆలోచించి ఓటేయండి. ఇంటికి పోయిన తర్వాత ఊరిలో, బస్తీలో కేసీఆర్‌ మాటల్లో నిజం ఏంటో చర్చించాలని కోరారు.

ధరణి ఉండాలా.. వద్దా.. ?

రాహుల్‌గాంధీ సహ భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని కేసీఆర్‌ అన్నారు. ధరణి ఉంటే భూముల వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. రైతుబంధు పథకం పైసలు పడుతున్నాయి. ధరణి తీసేస్తే మళ్లీ వీఆర్వోలు, పైరవీకారులు, దళారులు వస్తారన్నారు. అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తు చేశారు. ధరణి ఉండాలో.. వద్దో ప్రజలు ఆలోచించి ఓటేయలన్నారు.

ఇక మీ ఇష్టం

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ మీరు ఓడగొడితే ఇంటికిపోయి రెస్ట్ తీసుకుంటాం. మాకు పోయేది ఏమీ లేదు. నష్టపోయేది ప్రజలే. చెప్పడం మా బాధ్యత అన్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleSiricilla Politics: మంత్రి కేటీఆర్‌పై రాణీ రుద్రమ ఆగ్రహం.. అసలేం జరిగింది..?
Next articleIPL Auction 2024: ఐపీఎల్‌ వేలం డేట్ ఫిక్స్.. ఫ్రాంచైజీలకు గుడ్‌న్యూస్