తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులను కవర్ చేయడానికి మీడియాకు అనుమతి ఇవ్వాలని V6 న్యూస్, వెలుగు పత్రిక దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
భవనాల కూల్చివేతను కవర్ చేయనివ్వకుండా ఆంక్షలు విధించారని పిటిషనర్ తెలిపారు. సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ఎవరిని అనుమతించడం లేదన్నారు. ప్రజల డబ్బుతో నిర్మించిన పాత సచివాలయ భవనాలను కూల్చి, కొత్తవి నిర్మించే క్రమంలో అక్కడ జరిగే పనులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. కూల్చివేత పనులను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులను అనుమతించకపోవడం పత్రికా స్వేచ్చను హరించడం అవుతుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.
కూల్చివేతల సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే, కవరేజీ సమయంలో ఇంజనీర్ల సూచనల ప్రకారమే నడుచుకుంటామని పిటిషనర్ తెలిపారు. అయితే, మీడియాను అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా తమకు అనుమతివ్వాలని అడుగుతారని ఏజీ వాదించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. వార్ జోన్‌లోకి కూడా మీడియాను అనుమతిస్తున్నారు కదా అని గుర్తు చేసింది. నిషేధిత ప్రాంతాలు మినహా మీడియాకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ విషయంపై ప్రభుత్వాన్ని అడిగి చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. దీనిపై విచారణ రేపటికి వాయిదా పడింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com