మెగాస్టార్ చిరంజీవి డీప్‌ఫేక్ (DeepFake) వీడియోల కేసులో ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటికే డీప్‌ఫేక్ వీడియోలను సోషల్ మీడియా నుంచి పోలీసులు తొలగించారు. సైబర్ నేరగాళ్లు చిరంజీవి ఫొటోలు మార్ఫింగ్ చేసి, అశ్లీల వీడియోలు సృష్టించారు. ఈ క్రమంలో ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడ నుంచి పోస్టు చేశారనే దానిపై విచారణ చేపట్టారు.
ఫేక్ వీడియోలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సినీ పరిశ్రమలో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా డీప్‌ఫేక్ వీడియోలు రూపొందిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు చిరంజీవి ఫిర్యాదు చేశారు.
డీప్‌ఫేక్‌పై చిరంజీవి (Chiranjeevi) రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళానని.. డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారని చెప్పారు. పోలీస్ వ్యవస్థ చాలా బలంగా ఉందని.. ఎవరూ డీప్‌ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని… కానీ దాని వల్ల ముప్పు కూడా ఉందన్నారు మెగాస్టార్. ప్రభుత్వాలు కూడా దీనిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు.