నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చారు. ఇప్పటివరకు తండ్రి సినిమాల నిర్మాణ పనుల్లో తెర వెనుక చురుగ్గా పాల్గొన్న ఆమె.. తాజాగా ‘సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఓ వాణిజ్య ప్రకటనలో నటించి నటిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా తేజస్వినిని ప్రకటించింది. ఆమె హుందాతనం, సంప్రదాయబద్ధమైన రూపం తమ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సంస్థ పేర్కొంది. ఈ మేరకు చిత్రీకరించిన కమర్షియల్ యాడ్ వీడియో తాజాగా విడుదలై, నందమూరి అభిమానులలో ఆనందాన్ని నింపింది. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రత్యేక ఆకర్షణలు:
ఈ కమర్షియల్ యాడ్‌కు వై. యమున కిషోర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఎస్.ఎస్. థమన్ అందించిన సంగీతం, అయాంకా బోస్ ఛాయాగ్రహణం ఈ యాడ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
కాగా తేజస్విని విశాఖపట్నం ఎంపీ భరత్ అర్ధాంగి అన్న విషయం తెలిసిందే. ఈ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సంస్థను నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమల్లి, శ్రీ దుర్గా కాట్రగడ్డ అనే ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు విజయవంతంగా నడుపుతున్నారు. తేజస్విని భాగస్వామ్యం ద్వారా తమ బ్రాండ్ విలువలు, కళ మరియు సౌందర్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తున్నామని వారు తెలిపారు. ఈ పరిణామం నందమూరి వారసురాలిగా తేజస్విని కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, వినోద రంగంలో ఆమెకు సరికొత్త గుర్తింపును తెచ్చిపెడుతోంది.