భూమికి సంబంధించిన ఎన్వోసీ కోసం కలెక్టర్ పేరుతో కలెక్షన్లు వసూల్ చేశాడు. 5 ఎకరాలు రాయించుకున్నాడు. 8 ఖాళీ చెక్కులు తీసుకున్నాడు. బాధితుడిపై మరింత ఒత్తిడి తెచ్చి చివరకు ఏసీబీకి చిక్కాడు. మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతి లీలలు ఏసీబీ దర్యాప్తులో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్‌లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్‌వోసీ ఇవ్వాలంటే కలెక్టర్‌కు 1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పి డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్‌వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ-1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ-2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ-3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ-4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ-5గా నగేశ్ బినామీ కోలా జీవన్ గౌడ్‌లను పేర్కొంది.
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, చందానగర్ ప్రాంతానికి చెందిన డాక్టర్ కన్నెబోయిన లింగమూర్తి, మరో నలుగురితో కలిసి మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలోని 112.21 గుంటల భూమిని సత్యనారాయణ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం నర్సాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా..ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉన్నందున, కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని సబ్ రిజిస్ట్రార్ సూచించారు. ఎన్వోసీ కోసం జూలై 21న కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. దీనికోసం బాధితుడు లింగమూర్తి జూలై 30న అడిషనల్ కలెక్టర్ నగేశ్‌ను కలిశారు. 112 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు ఎకరానికి రూ.లక్ష చొప్పున కలెక్టర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి, మొత్తం రూ.కోటి 12 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు అందుకు అంగీకరించి, అడ్వాన్స్ కింద జూలై 31న రూ.19.5 లక్షలు కలెక్టరేట్‌లో అందజేశాడు. ఆగస్టు 7న మరో రూ.20.5 లక్షలను అడిషనల్ కలెక్టర్ అధికారిక నివాసంలో ఇచ్చాడు.
మిగిలిన 72 లక్షలు ఇస్తేనే ల్యాండ్ సర్వేతోపాటు ఆన్‌లైన్‌లో రికార్డులు సరిచేస్తామని బాధితుడికి అడిషనల్ కలెక్టర్ నగేశ్ తేల్చి చెప్పాడు. కరోనా సమయంలో ఒకేసారి అంత మొత్తంలో డబ్బు ఇవ్వలేనని బాధితుడు బతిమాలాడు. పదెకరాలు తన బినామీ జీవన్‌గౌడ్ పేరిట రాసివ్వాలని, ఎనిమిది బ్లాంక్ చెక్కులు ఇవ్వాలని నగేశ్ డిమాండ్ చేశాడు. పదెకరాలు రాసివ్వలేనని, రూ.72 లక్షల విలువైన ఐదెకరాలు మాత్రం ఇస్తానని బాధితుడు చెప్పడంతో అందుకు ఏసీ అంగీకరించాడు. భూమికి అగ్రిమెంట్ తోపాటు బ్లాంక్ చెక్కులను తీసుకున్నాడు. భూమి రాసిచ్చినప్పటికీ లంచం మొత్తం నగదు రూపంలోనే ఇవ్వాలని నగేశ్ ఒత్తిడి తేవడంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
భారీ లంచానికి సంబంధించి ప్రతి చర్చ, అధికారులతో మాట్లాడిన ప్రతి సందర్భాన్ని బాధితుడు తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఇందులో అడిషనల్ కలెక్టర్ నగేశ్‌తోపాటు ఇతర రెవెన్యూ అధికారులందరి మాటలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 8న కేసు నమోదుచేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సోదాలకు తొలుత విముఖత వ్యక్తంచేసిన అడిషనల్ కలెక్టర్.. అన్ని ఆధారాలు ముందు పెట్టడంతో నోరు మెదపలేదు. సోదాల్లో భాగంగా ఏసీబీ అధికారులు 72 లక్షలకు సంబంధించిన చెక్కులు, అగ్రిమెంట్ పేపర్లు గురించి నగేశ్‌ను ప్రశ్నించగా..అవి బహుశా కలెక్టర్ ధర్మారెడ్డి దగ్గరే ఉన్నాయేమో..అంటూ నగేశ్ సమాధానం ఇచ్చినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత నగేశ్ ఇంట్లోనే అవి లభించినట్టు రిపోర్టులో తెలిపారు.