ఆయన మాటే మంత్రం..పిలుపే వేదం..భారతవనీ మార్పు కోరుకుంటున్న సమయంలో నేనున్నాంటూ రాజకీయ యవనికపై దూసుకొచ్చారు నరేంద్ర మోడీ. ఆ రెండక్షరాలు రెండు దశాబ్దాల కింద ఎవరకీ తెలీదు. కానీ ఇప్పుడు విశ్వమంతా మార్మోగుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధాని. పడిలేచిన కెరటానికి ప్రతీక.. మట్టిలో మాణిక్యం అనే మాటకు నిలువుటద్దం.ఘనమైన ప్రతిభే ఆయన గాడ్ ఫాదర్. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచానికి భారత్ ను సరికొత్తగా పరిచయం చేసిన నాయకుడు మోడీ.
మోడీ అంటే పేరు కాదు. అదొక మ్యాజిక్. ఆయన మంచి మాటకారి.కానీ మొండిమనిషి. ఆ పైనే అంతులేని ప్రేమ కురిపించగలడు. వెంటనే నిప్పులు చెరగగలడు. దేశ రాజకీయాలను ఏలేవరకు ఆయన ఢిల్లీకి మాత్రం అపరిచితుడుగానే ఉన్నాడు. ఒక్కసారి ఆ ఢిల్లీ పీఠం ఎక్కిన తర్వాత ప్రపంచానికే ఆప్తమిత్రుడు అయిపోయాడు. ఆదినుంచి ఆయన అచ్చేదిన్ ఆశావాదిలాగే అడుగులేశాడు. అదే సమయంలో అవినీతికి బద్ద విరోధిలా మెలుగుతూ వచ్చాడు. ముక్కుసూటిగా వ్యవహరించడం.. మొండిగా ముందుకెళ్లడం అసరమైన చోట దూసుకెళ్లడం ఆయనకు అలవాటు.
గుజరాత్ లోని వద్ నగర్ నుంచి ఢిల్లీలోని అక్బర్ రోడ్డు వరకు మోడీ ప్రయాణం అనితర సాధ్యం. అది 2001 అక్టోబర్ 7, అప్పటివరకు ఎవరికీ పెద్దగా పరిచయం లేని నరేంద్ర మోడీ గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సీఎంగా ఎన్ని పేరుప్రఖ్యాతలు పొందారో గుజరాత్ అల్లర్ల సందర్భంగా అంతే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆనాడు ఆయనను విమర్శించిన ఎంతోమంది ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి అవడానికి సహకరించారు. గుజరాత్ లో మోడీ చేసిన అద్భుతాల్లో అతి ముఖ్యమైనది 24గంటల విద్యుత్ సరాఫరా. నిజానికి ఈ ఒక్క విజయంతో ఆయన హీరో అయిపోయారు. దేశంలో ఒక రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా విద్యుత్ కోత లేకపోవడం ఎవరు ఊహంచని విషయం. అదే 2014లో ప్రధానిమంత్రి అవడానికి కారణమైందంటే అతిశయోక్తి కాదు.
చాయ్ వాలా నుండి దేశ ప్రధానిగా ఎదిగిన మోడీ పనినే ప్రేమిస్తారు. పనినే ఆస్వాదిస్తారు. 2014 నుంచీ ఇప్పటివరకు చూస్తే ఎంత మార్పు. ఆస్ట్రేలియా నుండి అమెరికా వరకు మన పరపతి పెరిగింది. ఇదంతా మోడీ మహత్యమే. దూకుడుగా పనిచేసే మొండిఘటం మోడీ, ఒక్కమాటతో పాకిస్థాన్ ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన చతురుడు. చైనాను అంతర్జాతీయంగా పలుచన చేయడానికి ఖలేజా కావాలి. నెహ్రూ నుంచి వాజ్ పెయి వరకు ఎర్రకోట పై నుంచి ఎందరో ప్రధానులు ప్రసంగించారు. కానీ పాకిస్థాన్ విషయంలో దూకుడుగా ముందడుగు వేసిన సందర్భాలు అరుదు.మోడీ ఆ పని చేశారు.
ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు ఎక్కుపెట్టిన ఎన్నడూ దేనికి తలవంచని ధైర్యం ఆయన సొంతం. అసలు 20ఏళ్ల ముందు మోడీ ఎవరంటే కేంద్ర రాజకీయాల్లో పెద్దగా తెలియన పేరు. కానీ ఒక్క భూకంపంతో ఆయన జీవితమే మారిపోయింది. ప్రకృతి ప్రకోపానికి మోడీకి సంబంధం ఏంటో అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తరచి చూస్తే కమలనాథుల్లో ఒకడిగా పేరు తెచ్చుకోలేకపోయిన మోడీ ఒక్కసారిగా గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి ప్రధాని పీఠానికి అడుగులేశాడు. ఇప్పుడు దేశ ప్రధానిగా కొత్త చరిత్ర లిఖించుకుంటూ ముందుకు సాగుతున్నారు.
గుజరాత్ అనగానే గుర్తొచ్చే అంశం పారిశ్రామిక అభివృద్ధి అయితే రెండోది గోద్రా అల్లర్లు. ఈ రెండు మోడీ హయాంలో జరిగినవే. 2001లో కచ్ భూకంపం తర్వాత సహాయక కార్యక్రమాల్లో చోటుచేసుకున్న అవినీతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్నే కుదిపేసింది. దీంతో ఆపై జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. అది అప్పటి సీఎం కేశుభాయ్ పటేల్ పదవికే ఎసరు పెట్టింది. విధిలేని పరిస్థితుల్లో కేశుభాయ్ పటేల్ రాజీనామాతో సీఎం పీఠం ఖాళీ అయిపోయింది. అయితే అప్పటికి ఈ స్థానానికి ఎవరు అర్హులన్న వెతుకులాటలో అద్వానీ నోట వినిపించిన పేరు నరేంద్ర మోడీ.
మోడీ సీఎం అయినా మరుసటి ఏడాదే గోద్రా ఘటన చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలు కావొస్తున్న ఆ నెత్తుటి మరకలు నేటికి మోడీని వదిలిపోలేదు. సుధీర్ఘ దర్యాప్తులు, సునిశిత పరిశీలనల తర్వాత మోడీ ఈ కేసు నుండి క్లీన్ చీట్ తో బయటకొచ్చారు. ఈ ఘటనలో మోడీకి సంబంధంలేదని కోర్టులు తీర్పివ్వడానికి తొమ్మిదేళ్లు పట్టిన జనం మాత్రం ఆయనకు ఏడాదికే క్లీన్ చీట్ ఇచ్చేశారు. 2002 గుజరాత్ ఎన్నికల్లో మోడీకి ప్రజలు జయకేతనం పలికారు. అప్పటినుండి 2012 వరకు అప్రతిహితంగా గుజరాత్ సీఎంగా గెలుచుకుంటూ వచ్చారు ప్రధాని మోడీ.
అసాధారణ ప్రతిభాశాలి అయినా మోడీ జీవితంలో ఎన్నో వైవిధ్యాలు, మరెన్నో వైరుధ్యాలు. యూపీఏ హయాంలో అవినీతి అక్రమాలు లాంటి పరిస్థితుల నుండి పుట్టుకొచ్చిన వ్యక్తి ఆయన. గుజరాత్ లో ఎక్కడో టీ లు అమ్ముకునే వ్యక్తి భారతదేశపు భవిష్యత్తు రాస్తాడంటే ఎవరైనా నమ్మగలరా.. కానీ నమ్మాలి ఎందుకంటే దేశగమనం ఒక దశ నుంచి మరో దశకు మారే గమనంలో తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకుసాగుతున్నారు మోడీ.
దేశరాజకీయాలలో ఉన్న అనేక అవలక్షణాలకు దూరంగా బీజేపీ మొదటితరం పార్టీని నడుపుకుంటూ వచ్చింది. రాజకీయాలకు సిద్ధాంతాలను మిక్స్ చేసి వేగంగా పరుగులు తీసింది. అలాంటి తరుణంలో పార్టీలో ఎక్కడో ఉన్న వ్యక్తి రెండు దశాబ్దాల తర్వాత ఆ పార్టీని మించి ఎదుగుతారనేది ఎవరు ఊహించని అంశం. దేశంలోని రాజకీయాలు, అధికారం ఒక కుటుంబానికి సంబంధించిన గుత్త హక్కుగా భావించే జనపథ్ వర్గాల అభిప్రాయాలను పటాపంచలు చేశారు మోడీ. 2014లో ఆయన అందించిన విజయం బీజేపీని దేశంలో తిరుగులేని శక్తిగా మార్చింది. ఆ శక్తి దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.
2014లో మిషన్ 270 ప్లస్, 2019లో మిషన్ 350 అని చెప్పి బరిలోకి దిగిన మోడీ రెండు సందర్భాల్లో ప్రత్యర్థులను తుడిచిపెట్టేశారు. ఉత్తరాదిన ప్రాంతీయ పార్టీల కమ్ములు విరిచేశారు. రాజకీయాలలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మోడీ విజయం వెనుక కార్పోరేట్ ప్లానింగ్ ఉంది. నెలల తరబడి కృషి ఉంది. యుద్దంలో గెలవాలంటే రాజు ఒక్కడే కాదు వ్యూహాత్మకంగా సేనలను నడిపించడం ముఖ్యమే. శత్రువు బలహీనతలను తెలుసుకుని వాటిని తమ బలాలుగా మార్చుకోవాలి. మోడీ అండ్ టీం చేసింది అదే. ఆ స్ట్రాటజియే మెడీని ఇతిహాసపు నాయకుడిగా నిలబెట్టింది. ఆ స్ట్రాటజియే అడుగుపెట్టిన ప్రతిచోట నెగ్గేలా చేసింది.
నరేంద్ర మోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నామినేట్ అయిన రోజున నాలుగైదు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ తరహా సిద్ధాంతవాద రాజకీయాలను పక్కనబెట్టి పార్టీకి పక్కా పొలిటికల్ కలర్ తీసుకొచ్చారు మోడీ. హిందీ రాష్ట్రాలకే పరిమితమన్న అపవాదను పక్కనబెట్టి అసేతు హిమాచలం విస్తరించే దిశగా దూసుకపోతున్నారు మోడీ. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు ఆనవాళ్లు కూడా లేని చోట ఇప్పుడు జెండా పాతారు. ప్రత్యర్ధులని ఓడించడం కాదు దాదాపు మట్టికరిపించారు.
మోడీ రెండు ఎన్నికల్లో కొట్టిన దెబ్బలకు కాంగ్రెస్ కోలుకుంటుందా అనేది సందేహం. ప్రత్యుర్థులంతా ఏకమయ్యే కొద్దీ ఆయన బలం మరింత పెరుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు మోడీ లక్ష్యం ఒక్కటే 2024లో కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం. అందుకే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలన్నీ 2024 ఎన్నికలే టార్గెట్ గా రూపొందించారు. రానున్న నాలుగేళ్లలో భారత్ ను 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవపస్థగా తీర్చిదిద్దడం, దేశంలో పేదలందరికీ గృహనిర్మాణం, వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి కఠిన లక్ష్యాల సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. సంక్షేమ పథకాలకు నిధులు అధికంగా కేటాయించడం కన్నా దేశాన్ని అభివృద్ధి చేయడమే మోడీ ఆలోచన.
ప్రతికూల పరిస్థితులతో పోరాడడం అనేది మోదీ గుజారత్ సీఎం గా ఉన్నప్పుడే మొదలైంది. అదే ఇప్పుడు బీజేపీని నడిపిస్తోంది. జారిపోతున్న పరిస్థితులను చేతుల్లోకి తీసుకోవడం ఎలా అనే దానికి 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ప్రచారమే ప్రత్యక్ష ఉదాహరణ. పుల్వామా ఘటన తర్వాత పాలెం విమానాశ్రయంలో శవపేటికలకు వందనం చేస్తూ కంపిస్తున్న స్వరంతో మాట్లాడి ఎందరినో రోమాంచితం చేశారు. ఎన్నికలకు ముందు వారణాసిలో మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి మన మనసులను కరిగించారు. చంద్రయాన్ విఫలమైన తర్వాత ఇస్రో చైర్మన్ ను ఓదార్చిన తీరు దేశాన్ని ఆకర్షించింది.
ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తేలిక కావొచ్చు. కానీ ఆర్థికవ్యవస్థతో అలాంటి సౌలభ్యం లేదు. పడిపోతున్న వృద్ధి రేటు..పెరిగిపోతున్న నిరుద్యోగత.. దిగజారుతున్న అభివృద్ధి..ఉరుముతున్న ఆర్థికమాంద్యం లాంటివి మోడీకి సవాల్ విసురుతున్నాయి. తాను అధికారంలోకి వస్తే అచ్చేదిన్ వస్తాయంటూ 2014ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో మోడీ చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగానే పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. అన్నిటికంటే ముఖ్యంగా ముడిచమురు ధర 170 డాలర్ల నుండి 70 డాలర్లకు దిగివచ్చింది. వరుసగా రెండేళ్లు వృద్ధి రేటు అంచనాలను దాటాయి. విదేశీ పెట్టుబడుల వరద పారింది. మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా అంటూ రకరకాల స్కీములను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఉన్నట్టుండి సడెన్ గా ఏమైందో ఏమో 2016 నవంబర్ 8న 1000, 500నోట్లను రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. ముందుగా ఎలాంటి సన్నాహాలు, సమాచారం లేకుండా చెలామణిలో ఉన్న 80శాతం కరెన్సీని రద్దు చేయడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్థిక లావాదేవీలన్నీ నగదు రూపంలో జరిగే దేశంలో 80శాతం నగదును రద్దుచేయడం ఊహించని దానికంటే ఎక్కువ దుష్పరిణామాలకు దారితీసింది. బ్లాక్ మనీని బయటకు తీసేందుకే నోట్ల రద్దు చేశామన్న మోడీ ఆ తర్వాత నగదు రహిత లావాదేవీల కోసమేనని మాట మార్చారు. పెద్దనోట్ల రద్దుతో ఉద్యోగుపాధి అవకాశాలు భారీగా దెబ్బతిన్నాయి. వృద్ధిరేటు 2శాతం తగ్గింది. చిన్న మధ్యతరహా పరిశ్రమలు భారీగా మూతబడ్డాయి. ప్రజలు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేసేందుకు బయపడాల్సిన రోజులు వచ్చాయి.
నగదు రద్దు సృష్టించిన అలజడి నుంచి ఆర్థికవ్యవస్థ బయటపడుతున్న తరుణంలో జీఎస్టీ రూపంలో మరో పిడుగు పడింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో అర్ధరాత్రి పూట ఆర్భాటంగా వస్తుసేవల పన్నును తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. ఇది కూడా ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. జీఎస్టీ అమలుకు పూర్తిగా సిద్ధం కాకుండానే అమలుచేశారన్న ఆరోపణలు వచ్చాయి. జీఎస్టీ అమలు తర్వాత ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. వస్తువుల రేట్లు తగ్గుతాయనుకుంటే తగ్గలేదు. పైగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ కిందకు తీసుకువస్తుందనుకుంటే తీసుకరాలేదు. అంతేకాకుండా వాటి ధర పెరగడం ప్రతికూల ప్రభావం చూపాయి.
నోట్ల రద్దు, జీఎస్టీ అమలువల్ల ఏర్పడిన దుష్పరిణామం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు వేరువేరు అని నిరూపించాయి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు. నోట్ల రద్దు తర్వాత జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఉత్తరప్రదేశ్ లో ప్రత్యర్థులను చిత్తుచేసింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీలో 300కు పైగా సీట్లను గెలచుకుంది. పంజాబ్ మినహా మిగితా రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగిరింది. జీఎస్టీ అమలు తర్వాత వెంటనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది.
ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతున్నా సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపికే పట్టం కట్టారు ప్రజలు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా సీట్లు సాధించి మోడీ చరిత్ర సృష్టించారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులు అవినీతిపై ఉక్కుపాదం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిషేధం వంటివి మోడీ సాహసోపేత నిర్ణయాలకు ఉదాహారణలు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాలలో 10శాతం రిజర్వేషన్ , ఉజ్వల్ యోజన, ప్రధానమంత్రి అవాస్ యోజనా, ఎల్ఈడీ బల్బులు, ముద్ర, స్కిల్ ఇండియా, ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్, అసంఘటిత కార్మికులకు పెన్షన్, పంటలకు గిట్టుబాటు ధర 10కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు ఏర్పాటు వంటివి పేదలు సాధికారత సాధించడంలో మోడీ అనితరసాధ్య కృషికి కొన్ని నిదర్శనాలు.
దేశం ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. అంతర్జాతీయంగా పరిస్థితులు కూడా అంత సానుకూలంగా లేవు. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కన్పిస్తోంది. రాజకీయంగా మోడీ సమర్ధుడనే దానిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే ఆర్థికపరమైన అంశాలను అమలుచేయడంలో నాయకత్వ లక్షణాలతోపాటు వ్యూహాలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల నుండి ఆర్థికవ్యవస్థను గట్టెక్కించడం మోడీ జీవితంలో ఆయన ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ కావొచ్చు. ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించేందుకు ఆయన ఏం చేస్తారనదే ఆసక్తికరం.
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.