రామాయణం గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా యుగాలు చాలవు. రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలుగానే అవతరించింది ఈ లోకంలో. అసలు బ్రహ్మలోకంలో అది శతకోటి ప్రవిస్తరం అంటారు. మనం అంత గ్రహించలేం. ఈ ఇరవైనాలుగు వేల శ్లోకాలనే కొన్ని కాండలుగా విభజించారు. ఇది ఒక అవధి అని కాండాలకి ఒక్కో పేరు పెట్టారు.
“బాలకాండ”, “సుందర కాండ”కు ఉన్న పేర్లలో ఎంతో రహస్యం ఉంది. బాల కాండము అంటే రాముడు బాలుడిగా ఉన్నప్పటి విషయాలను చెప్పారని అనిపిస్తుంది. కానీ రాముని బాల్యాన్ని గురించి అంతగా ప్రస్తావించదు. 18వ సర్గలో రామలక్ష్మణభరతశత్రజ్ఞులు జన్మించిరి అని చెప్పి, వారికి 11 వ రోజున నామకరణం చేశారు. వేద విద్యలు, బుద్ధిమంతులైన ఆ పిల్లలు అస్త్రశస్త్రాలు నేర్చుకున్నారు. వారికి పెళ్ళి చేయాలని వారి తండ్రి అనుకుంటున్నాడు.
అంతలోనే విశ్వామిత్రుడు వచ్చాడు అని చెబుతాడు వాల్మీకి. ఒక నాలుగైదు శ్లోకాలు మాత్రమే ఉంటాయి. రాముని బాల్యం గురించి ఇక ప్రస్తావన ఉండదు. తరువాత విశ్వామిత్రుడు తన యజ్ఞ పరిరక్షణకై రాముడిని కోరుతాడు. ముందు దశరథుడు ఒప్పుకోడు కానీ తరువాత వశిష్టులవారు చెబితే అప్పుడు శ్రీరాముడిని ఆయన వెంట పంపుతాడు. ఆ తరువాత రామ లక్ష్మణులు ఇద్దరు విశ్వామిత్రునితో కలిసి అడవిలో ప్రయాణించడమే ఉంటుంది. “బాలకాండ” ముగిసే సరికి రామచంద్రుడు సీతమ్మను వివాహం ఆడి అయోధ్యచేరి 12 సంవత్సరాలు గడుస్తుంది. బాల్యం గురించి ఏమి చెప్పనప్పటికీ ఈ కాండము అంతా విశ్వామిత్రుని గురించి చెప్పడానికి అని అర్థమవుతుంది.
విశ్వామిత్రుడు బాలుడా.. ఎంతో పెద్ద ఋషి, ఎన్నో పనులు చేశాడు. ఎన్నో సార్లు తను దిగజారి పోయాడు. ఎంతో కష్టపడి తిరిగిపైకి వచ్చాడు. కానీ బాలుడంటే ఆయనే. బాల కాండలో దశరథ మహారాజు రామచంద్రుని భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెట్టగానే వారి భవిష్యత్తు తీర్చి దిద్దగలిగేవాడు విశ్వామిత్రుడే. కనుక ఆయన గురించే ప్రస్తావించాడు వాల్మీకి. విశ్వామిత్రుడు వచ్చి రామచంద్రుడిని తీసుకెళ్ళి రకరకాల అస్త్రశస్త్రాలను నేర్పించి సీతారాముల కళ్యాణం వరకు మాత్రమే విశ్వామిత్రుడు కనిపిస్తాడు.
యాగ రక్షణ తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనక చక్రవర్తి సభకి తీసుకొస్తాడు. అక్కడ పూర్వ పరాలు విచారించాక.. జనక చక్రవర్తి యొక్క మంత్రి శతానందుడు రామ లక్ష్మణులతో విశ్వామిత్రుని గురించి చెబుతాడు. విశ్వామిత్రుడు మీకు గురువు కావడం ఎంతో అదృష్టం. ఇతను ఒకప్పుడు ఎలా ఉండే వాడు ఈ నాడు ఎలా అయ్యాడు. లోకంలో తనను తాను ఇంతగా సంస్కరించుకున్న వ్యక్తి మరొకడు లేడు అని వారందరికీ విశ్వామిత్రుని కథని వర్ణిస్తాడు.
విశ్వామిత్రుని కథ అంత ఆనందదాయకంగా ఉండదు. అంత అందంగానూ ఉండదు. అంతకుముందు ఆయన ఎన్నో సార్లు కామ క్రోదాలను జయించలేక పోయాడు. కానీ సభలో కూర్చోబెట్టి శతానందుడు విశ్వామిత్రుని కథను పిల్లలకు చెబుతుంటే ఎలాంటి కోపం రాలేదు, స్పందించలేదు. తను వేరే వారి కథను వింటున్నట్టు కుదురుగా కూర్చుంటాడు. ఆ స్థితికి పక్వత చెందాడు.
సాధకుడిగా తను తపస్సు చేసినప్పుడు కామ క్రోదాలకు బానిస అయ్యాడు. కానీ తన సాధనకి దైవానుగ్రహంగా శ్రీరామచంద్రుడిని జోడు చేసుకొన్నాడు. అలా రామాయణంలో ప్రతి అంశం మానవుడు తెలుసుకోవాల్సినవే. ఒక బాలుడి వలె మనస్తత్వం ఆయనలో ఏర్పడింది. పిల్లవాని వలె నిష్కల్మషంగా తయారు అయ్యాడు. కనుకనే “బాలకాండ” అని పేరు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?