30 రోజుల పాటు అన్నం మానేస్తే ఏమవుతుంది.. మీరు ఊహించలేరు..

ఒక నెల పాటు అన్నం మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి..? బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిల స్థిరత్వం వంటి ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఆకలి, చిరాకు, మరియు పోషకాహార లోపం వంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

మన దైనందిన ఆహారంలో బియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామంది భారతీయులకు, ముఖ్యంగా దక్షిణాది వారికి అన్నం లేకుండా భోజనం అసంపూర్ణం. రోజుకు మూడు పూటలా అన్నం తినేవారు కూడా ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిన కారణంగా చాలామంది తమ ఆహారంలో అన్నం మానేయడానికి ప్రయత్నిస్తున్నారు. అన్నం మానేస్తే నిజంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుందా? ఒక నెల పాటు అన్నం పూర్తిగా మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

ఆకలి, చిరాకు తొలి రోజుల్లో సవాలు

అన్నం మన శరీరానికి త్వరగా శక్తినిచ్చే ప్రధాన వనరు. అన్నం తీసుకోవడం అకస్మాత్తుగా మానేసినప్పుడు, శరీరం ఈ మార్పుకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. మొదటి కొన్ని రోజుల్లో ఆకలి పెరగడం, బలహీనత లేదా కొద్దిపాటి చిరాకు వంటివి అనుభూతి చెందవచ్చు. ఈ దశలో అన్నంకి బదులుగా మిల్లెట్, బార్లీ, క్వినోవా లేదా గుమ్మడికాయ గింజలు వంటి ఇతర ఆరోగ్యకరమైన ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

బరువు తగ్గడం

బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. మీరు అన్నం తినడం మానేస్తే.. మీ శరీరానికి లభించే కేలరీల సంఖ్య తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. బరువు తగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న వారికి ఇది ఒక ప్రయోజనకరమైన మార్పు కావచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిల స్థిరత్వం

తెల్ల బియ్యం త్వరగా జీర్ణమై.. రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. అందుకే మధుమేహగ్రస్తులకు అన్నం పరిమితంగా తీసుకోవాలని సూచిస్తారు. ఒక నెల పాటు అన్నం పూర్తిగా మానేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి చాలా ప్రయోజనకరం.

జీర్ణక్రియలో మార్పులు 

కొంతమంది అన్నం తిన్న తర్వాత ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అన్నం మానేసినప్పుడు, మొదట్లో కొందరికి కడుపు నొప్పి లేదా తాత్కాలిక మలబద్ధకం అనిపించవచ్చు. అయితే మీరు ఎక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, అధిక ఫైబర్ గల ధాన్యాలు తీసుకుంటే.. మీ జీర్ణక్రియ త్వరగా మెరుగుపడుతుంది.

పోషకాహార లోపం ప్రమాదం

అన్నంలో విటమిన్ బి ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఎక్కువ కాలం అన్నం తీసుకోకపోతే, ఈ విటమిన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. దీని వలన అలసట, మానసిక స్థితిలో మార్పులు సంభవించవచ్చు. అన్నం మానేసేవారు.. విటమిన్ బి, ఇతర ముఖ్యమైన పోషకాల కోసం ఆకు కూరలు, చిక్కుళ్ళు, గుడ్లు, పాలు వంటి ప్రత్యామ్నాయ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.
అన్నం మానేయడం వల్ల బరువు తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడటం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. పోషకాహార లోపం రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అన్నం పూర్తిగా మానేసే ముందు, మీ శరీరానికి అవసరమైన పోషకాలను ఇతర ఆహార వనరుల నుండి పొందడానికి ఒక ఆహార ప్రణాళికను సిద్ధం చేసుకోవడం మంచిది.
(గమనిక: ఈ అంశాలు నిపుణులు, ఇంటర్నెట్ ద్వారా లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది.)
Previous articleఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ
Next articleచలికాలంలో ఖర్జూరాలు ఎందుకు తినాలి.. ఇవి తెలిస్తే లైట్ తీసుకోరు..