పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం

తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించి CM రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర CM దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు.

✅ ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ, మహారాష్ట్రల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

✅ తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై ఈ సమావేశంలో కీలకమైన చర్చలు జరిగాయి. బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు.

✅ సమావేశం ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ద్వారా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సంస్కృతి, గిరిజనుల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధి బృందం దృష్టికి తీసుకెళ్లారు.

✅ సుసంపన్నమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఉన్నప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోయిందని తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు అభివృద్ధి ఫలాలు అందలేదన్నారు. ఆర్థిక అవకాశాలు లేకపోవడం, వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు.

✅ ఆ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, ఎస్ బీ చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి.. వివిధ దశల్లో జరుగుతున్న ప్రయత్నాలను తెలిపారు. 5 దశాబ్దాలుగా అనేక ప్రతిపాదనలు, చర్చలు జరిగాయని గుర్తుచేశారు. అయినప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేకపోయామన్నారు.

✅ 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే, ఈ ఎత్తుతో బ్యారేజీ నిర్మిస్తే తెలంగాణ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.

✅ ప్రస్తుత విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్వహణ వ్యయం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అందుకే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.

✅ ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడమే అత్యంత ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని చెప్పారు. సాంకేతిక, నిర్వహణ, ఆర్థిక అంశాల పరంగా ఈ ప్రతిపాదనకు ఉన్న ప్రాధాన్యాన్ని మంత్రి తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

✅ బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అమల్లో ఉన్న భూసేకరణ నిబంధనలు, ఆ రాష్ట్ర పరిహార విధానం ప్రకారం రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారు.

Previous articleరేపు TRS రాజధాని రణభేరి సభ
Next articleమా అమ్మమ్మ తెలుగు మాట్లాడతారు