సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎకరాల భూముల ఆచూకీ లభ్యం కానందున, వాటి గుర్తింపునకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని CM రేవంత్ రెడ్డి ఆదేశించారు.
✅ 22A విషయంలో గత నెల 16న అసెంబ్లీలో జరిగిన చర్చలో CM ఆ భూములపై విచారణకు ఆదేశించారు. ఆ విచారణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
✅ విచారణ పురోగతి వివరాలను కమిటీ సభ్యులు CMకు వివరించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు రికార్డుల్లో నమోదై ఉందని, కానీ తాజా సర్వేలో 343 ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు చెప్పారు. రికార్డులో ఉన్న భూమికి, వాస్తవంగా ఉన్న భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఉందని చెప్పారు.
✅ ఈ క్రమంలో ఆ 45 ఎకరాల భూమిని తేల్చేందుకు ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వేకు నోటిఫికేషన్ విడుదల చేయాలని CM అధికారులను ఆదేశించారు. సర్వే నెంబర్ 325 సమీపంలోనే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున, వారి భూముల రికార్డులను సమర్పించాలని నోటీసులు జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
✅ సర్వే నంబర్ 325లో గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేయాలని CM అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని నిర్మించాలని ఆదేశించారు.
✅ అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలతో కాలనీని అభివృద్ధి చేయాలని సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని, వచ్చే జూన్ 2లోగా తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
✅ కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములు మినహా మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూల్ (YIIRS) తోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
✅ ఎల్నినో కారణంగా రిజర్వాయర్లు, చెరువుల నీటిని జాగ్రత్తగా వినియోగించాలని అధికారులకు సూచించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినియోగించే వారిని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని CM అధికారులను ఆదేశించారు.