ఇటీవల ప్రారంభించిన TGSRTC–హైదరాబాద్ మెట్రో కామన్ పాస్ ఛార్జీలను పునఃపరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న క్రమంలో, ప్రజల అభిప్రాయాలను, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఛార్జీలను సమీక్షించాలని నిర్ణయించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ప్రస్తుతం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా ఉండగా, ఇందులో మెట్రో వాటా రూ.300, ఆర్టీసీ వాటా రూ.100గా ఉంది. అదేవిధంగా నెలవారీ కామన్ పాస్ ధర రూ.8,500గా ఉండగా, ఇందులో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా నిర్ణయించారు.
అయితే ఈ ఛార్జీలు సామాన్య ప్రజలకు భారంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనతో ఛార్జీలను పునఃపరిశీలించాలని నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను సమీక్షించి, ప్రజలకు అందుబాటులో ఉండేలా కామన్ పాస్ ధరలను నిర్ణయించే అంశంపై త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి.
ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు, RTC, హైదరాబాద్ మెట్రో సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రయాణికులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరేలా, వారి అవసరాలకు అనుగుణంగా, సౌకర్యవంతమైన ధరలతో కామన్ పాస్ విధానం అమలయ్యేలా తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
ప్రజా రవాణాను మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టం చేశారు. ప్రజలపై అదనపు ఛార్జీల భారం మోపడం తమ లక్ష్యం కాదన్న మంత్రి. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ప్రయాణికులకు ప్రయోజనం చేకూరేలా త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.