కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో బస్సు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది చనిపోయారు. అయితే ఫోరెన్సిక్ టీమ్ ప్రమాద తీవ్రత పెరగడానికి సంబంధించిక కీలక విషయాన్ని బయటపెట్టింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు లగేజీ క్యాబిన్‌లో తరలిస్తున్న వందల మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి.
తొలుత బస్సు.. బైక్‌ను ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో నిప్పురవ్వలు చెలరేగడం, దానికి పెట్రోల్ తోడవడంతో మంటలు ప్రారంభమయ్యాయి.
అయితే ముందుగా లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన ఫోరెన్సిక్ బృందాలు తేల్చాయి.
ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులేవీ రవాణా చేయకూడదు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు ప్రయాణికుల వాహనాలను సరకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్‌లలో పెడుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటికి మంటలు అంటుకోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సాధారణంగా మొబైల్ ఫోన్ల పై భాగాన్ని ప్లాస్టిక్‌తో, బ్యాటరీలు లిథియంతో తయారు చేస్తారు. లిథియం మంటల్లో చిక్కితే పేలిపోతుంది. అది తెలిసి కూడా ప్రయాణికుల వాహనాల్లో వీటిని రవాణా చేయడం ఇంత భారీ ప్రాణనష్టానికి ప్రధాన కారణమైంది.