జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ మొదలైంది. కాసేపట్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. షేక్ పేట్ ఎమ్మార్వో ఆఫీస్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అక్టోబర్ 22న నామినేషన్లు పరిశీలిస్తారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు లెక్కిస్తారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, బీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇప్పటికే విడుదల చేశారు. మొత్తం 3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 2,07,367 మంది, మహిళా ఓటర్లు 1.91,590 మంది ఉన్నారు. అలాగే ఇతరులు 25 మంది ఉన్నారని ప్రకటించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 407 పోలింగ్ స్టేషన్లుండగా.. ఒక్కో పోలింగ్స్టేషన్లో యావరేజ్గా 980 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, BRS పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఏ క్షణమైనా బీజేపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.