కార్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి హైదరాబాద్ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యూందాయ్ ఇండియా సంస్థకు తెలిపారు. తెలంగాణలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
CMతో హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యోన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది.
✅ భౌగోళికంగా తెలంగాణ.. దేశంలో మధ్య భాగంలో ఉంది. దేశంలోని ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా, అత్యంత సురక్షితమైనదిగా, జీవించేందుకు అత్యంత అనుకూలమైన నగరంగా గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఇక్కడి సానుకూల పరిస్థితులను వివరించారు.
✅ జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ)లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ (HMIE) సమగ్ర గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.
✅ నిమ్జ్ లో రూ. 8,528 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న హ్యూందాయ్ కేంద్రం ద్వారా మొత్తం 4,276 ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని సంస్థ నిర్దేశించుకుంది. 678 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును దశల వారీగా అభివృద్ధి చేయనున్నారు.
✅ ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. రానున్న కొన్ని నెలల్లో ఈ కేంద్రానికి శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నట్టు తెలిపారు.
✅ 2024లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF) సమావేశాల సందర్భంగా, తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులతో సమావేశమైంది.
✅ అనంతరం, 2025 జూన్లో హ్యుందాయ్ ప్రతిపాదించిన ప్రతిష్ఠాత్మక ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గ పారిశ్రామిక, పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం ఆమోదం తెలిపింది.
✅ తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు రాష్ట్రం అత్యంత అనుకూలమైన ప్రదేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్లు, రహదారి, విమాన, రైలు మార్గాల ద్వారా బలమైన రవాణా మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో ఓడరేవులతో హైస్పీడ్ రవాణా అనుసంధానాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు రాష్ట్రానికి మరింతగా అనుకూలంగా మారుతాయని వివరించారు.
✅ తయారీ రంగం అభివృద్ధి కోసం పెరి-అర్బన్ రీజియన్ (PURE) వంటి ప్రణాళికాబద్ధమైన ప్రాంతీయ అభివృద్ధి నమూనాల ద్వారా తెలంగాణ వేగవంతమైన పారిశ్రామిక విస్తరణకు సిద్ధంగా ఉందని చెప్పారు.
✅ ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించాలన్న ప్రభుత్వ దార్శనికతను ముఖ్యమంత్రి వివరించారు. 2026లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా హ్యుందాయ్ నాయకత్వ బృందాన్ని ఆహ్వానించారు.
✅ హైదరాబాద్లో హ్యుందాయ్ మోటార్స్ ఇప్పటికే హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్కు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా సేవలందిస్తోంది.
✅ హ్యుందాయ్ ఇండియా ఇంజినీరింగ్ సామర్థ్యాలను మరింత విస్తరించే క్రమంలో, జహీరాబాద్ నిమ్జ్లో ఏర్పాటు చేయనున్న ఆర్ అండ్ డీ కేంద్రం, భారీ వాహన పరీక్షా కేంద్రం వాహనాల పరీక్షలు, పనితీరు ధ్రువీకరణ, ఇంజినీరింగ్ ప్రక్రియల మెరుగుదలలో కీలక పాత్ర పోషించనుంది.