త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర సంవత్సరాల్లో మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
❇️ ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎం వివరించారు.
❇️ హుస్నాబాద్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గత పదేళ్ల కాలంలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గడీలు, పెత్తందార్లకు వ్యతిరేకంగా సర్దార్ పాపన్న గౌడ్ నాయకత్వంలో బహుజనుల రాజ్య స్థాపనకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టారని ఆ ప్రాంత ప్రాధాన్యతను గుర్తుచేశారు.
❇️ తెలంగాణ మలిదశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా అండగా నిలిచిన తీరు, సోనియా గాంధీ ఇచ్చిన మాట, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాలని డిసెంబర్ 3న తెలంగాణ కోసం శ్రీకాంతా చారి బలిదానం చేసుకున్న ఘటనను సీఎం ప్రస్తావించారు. శ్రీకాంతా చారి ఆశయ సాధనలో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
❇️ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రజాప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
❇️ రైతులకు రుణమాఫీ, రైతు భరోసా వంటి వ్యవసాయ రంగంలో 1.04 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాల భర్తీ.. ఇలా చెప్పుకుంటూ వెళితే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని గుర్తుచేశారు.