సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ పదవీ కాలం నవంబరు 23న ముగియనుంది.
ఈ క్రమంలో తదుపరి CJI పేరును సూచించాలంటూ జస్టిస్ గవాయ్‌కి కేంద్రం కోరింది. సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది.
సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ఈ పదవి వరిస్తుంది. దీని ప్రకారం జస్టిస్ సూర్యకాంత్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే.. 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 24న ప్రమాణం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు.
జస్టిస్ సూర్యకాంత్ హర్యానాలోని హిస్సార్ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.