సమావేశానికి హాజరుకాలేను.. చంద్రబాబుకు బొత్స లేఖ

ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (APHRC) ఛైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక ప్రక్రియను హడావిడిగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం కమిటీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని భావించినప్పుడు, తనకు ముందస్తుగా సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తగినంత సమయం ఇవ్వకుండా చివరి నిమిషంలో ఆహ్వానం పంపడం వల్ల తాను ఈ సమావేశానికి రాలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబుకు బొత్స సత్యనారాయణ లేఖ రాశారు.

అక్టోబర్ 12న ఉదయం 11.30 గంటలకు ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్, మొదటి అంతస్తులో జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరు కావాలని తనకు అక్టోబర్ 11న సాయంత్రం 4.59 గంటలకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడాన్ని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. సమావేశానికి హాజరు కావడానికి 24 గంటల కంటే తక్కువ సమయం మాత్రమే ఇచ్చారని, ప్రస్తుతం తాను విజయనగరంలో ఉన్నానని వివరించారు. సమయం తక్కువగా ఉండటమే కాకుండా, మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక వంటి కీలక అంశాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్వహిస్తోందని, ఇది ఏ మాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పారు.

రాష్ట్ర మానవహక్కుల కమిషన్ ఎంపిక కమిటీ సభ్యులకు అభ్యర్థుల అర్హతలు, నేపథ్యాన్ని పరిశీలించడానికి చాలా తక్కువ సమయం ఇవ్వడం సరికాదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఉన్నందున, వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి సమయం అవసరమన్నారు. మానవ హక్కుల పరిరక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించే కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియలో కచ్చితత్వం, జాగ్రత్త, పూర్తిస్థాయి పరిశీలన అవసరమని బొత్స స్పష్టం చేశారు. తగిన చర్చ, లోతైన పరిశీలన లేకుండా హడావుడిగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయడం సహేతుకంగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ కారణాలతో అక్టోబర్ 12న జరగనున్న ఎంపిక కమిటీ సమావేశానికి హాజరుకాలేనని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు రాసిన లేఖ ప్రతిని ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్), సాధారణ పరిపాలన శాఖకు కూడా బొత్స సత్యనారాయణ పంపారు.

Previous articleభవిష్యత్తులో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది- CM రేవంత్ రెడ్డి
Next articleIndian Railways Announces 3,548 Vacancies