రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన SEC

APలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (SEC) కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని SEC అనిల్‌ చంద్రపునేఠా స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులతో SEC వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

స్థానిక ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ప్రధానంగా చర్చించారు. రెండు నెలలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎన్నికలకు అధికారులు సిద్ధంగా ఉన్నారని SEC వివరించారు. బ్యాలెట్ పేపర్‌ విధానంలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 5, 2026 వరకు ఉన్న ఫొటో ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఇటీవల YCP సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో SIR ప్రక్రియ ముగియకుండానే స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారని.. ఏ క్షణంలో అయినా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని YCP తరపు న్యాయవాది కోరారు. SIR పక్రియ ముగిసిన తర్వాతే.. స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. YCP దాఖలు చేసిన పిటిషన్‌లో తమ వాదనలు విన్న తర్వాతే తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ AP ప్రభుత్వం ఇప్పటికే కేవియట్‌ దాఖలు చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని స్పష్టం చేసింది. SIR ప్రక్రియ ముగిశాకే స్థానిక ఎన్నికలు జరపాలంటూ YCP దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో YCP సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Previous article25 Years of Seva.. From Gujarat to Viksit Bharat