తెలంగాణలో మంత్రుల మధ్య మాటలయుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. అయినప్పటికీ మంత్రులు మాత్రం వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు.
ఇటీవలే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్‌తో వివాదం మొదలైంది. అడ్లూరి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో అధిష్టానం కూడా ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన PCC చీఫ్.. మంత్రులు పొన్నం, అడ్లూరితో సమావేశమయ్యారు. ఇద్దరికి పీసీసీ చీఫ్ సర్ది చెప్పారు. పొన్నంతో సారీ కూడా చెప్పించారు. అంతటితో ఆ వివాదానికి ముగింపు పలికారు. కానీ నిజామాబాద్‌లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ టార్గెట్‌గా మంత్రి వివేక్ చేసిన కామెంట్స్‌తో మళ్లీ కొత్త లొల్లి మొదలైంది. మంత్రి అడ్లూరి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి మళ్లీ పార్టీ పెద్దలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు మేడారం జాతర పనులకు సంబంధించిన వివాదం కూడా రోజు రోజుకు ముదురుతోంది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. మేడారం జాతర పనులను పర్యవేక్షించే బాధ్యతను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అప్పగిస్తున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పొంగులేటి వర్గీయులు గుర్తుచేస్తున్నారు. ఇది మా కుటుంబ సమస్య అని.. మాట్లాడి పరిష్కారించుకుంటామని చెప్పుకొచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్.