తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లె పండుగ కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన వ్యక్తిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ధ్వంసం, తదుపరి చర్యలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
వారం రోజుల క్రితం పల్లెపండుగ 3.0 ద్వారా రూ. 4.75 కోట్లతో నిర్మించిన రోడ్డును సుబ్బారెడ్డి అనే వ్యక్తి, వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సాయంతో 100 మీటర్ల మేర ట్రాక్టర్‌తో దున్నేశారని, గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు వివరించారు. సాయంత్రంలోపు అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని చెప్పారు. బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు సౌకర్యం కలిగించే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, పల్లెపండుగ రోడ్డు ధ్వంసం చేసిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రజా ధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం అనేది దుర్మార్గపు చర్య అనీ, ఆ చర్యలకి పాల్పడ్డ నాయకులు, వారి వెనుక ఉన్నవారినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం ఇచ్చే మౌలిక సదుపాయాలుకి ఎవరు నష్టం చేశారో వారి నిజ స్వరూపం అందరికీ తెలియచేయాలి అన్నారు.
అనంతసముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తులపై రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను వర్తింపజేసి జరిగిన నష్టాన్ని వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.