ఎల్‌నినో కారణంగా తలెత్తిన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడానికి రాష్ట్ర రైతాంగంతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
❇️ ఎల్‌నినో వల్ల ఉత్పన్నమైన పరిస్థితులపై దసరా పండుగ తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు. పరిస్థితి తీవ్రతపై ఆ సమావేశంలో అన్ని పార్టీల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు.
❇️ ఆ తర్వాత నవంబర్ మొదటి వారంలో అఖిల పక్ష ప్రతినిధి బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలిసి సహకారం కోరుతామని సీఎం వివరించారు. ఈ సంక్షోభ కాలం నుంచి గట్టెక్కడానికి తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి అన్ని శాఖలను అప్రమత్తం చేశారు.
❇️ ఎల్‌నినో కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులు, తీసుకోవలసిన చర్యలపై ప్రణాళికల గురించి.. వివరించి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
❇️ సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు పెద్ద మనసుతో ఎండాకాలం పంటలు వేయడం తగ్గించుకోవాలని సీఎం సూచించారు. ఒక సీజన్ పంట పండించే పనులను వాయిదా వేసుకొని, ఉన్న నీటిని తాగడానికి వినియోగించుకోవాలన్నారు.
❇️ ఎల్‌నినోను ఎదుర్కొనడానికి ప్రజలకు అండగా నిలబడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పుడు ప్రచారం నమ్మి వరి పంటలు వేస్తే నీరు అందించలేక పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోవడమే కాకుండా మోటార్లు, మీటర్లు కాలిపోయే పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
❇️ రైతులతో పాటు ఈ సంక్షోభ పరిస్థితుల్లో భూమిలేని నిరుపేద కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ప్రస్తుత కాలంలో పంట నష్టపోయిన వారికి, ఎండాకాలంలో వాయిదా వేసుకునే పంట నష్టానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విపత్తుల నిధి నుంచి సహకారం అందించాలన్నారు.
❇️ ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తాయని, ఆరుతడి పంటలు వేసుకోవాలని వర్షాకాలం ప్రారంభం నుంచి చెబుతూ వచ్చామన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో సగటున 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈరోజు 20 వేల మెగావాట్లకు చేరుకుందన్నారు.
❇️ 2014-15 నాటికి సగటున 6500 – 7,000 మెగావాట్ల వినియోగం ఉండగా, ఈ 13 ఏళ్లలో 14 వేల మెగావాట్ల వినియోగం పెరిగిందని సీఎం వివరించారు.
❇️ ఇంకో 15 – 20 రోజుల్లో వర్షాకాలం పంటలు కోతలు అయిపోతాయని… చేతికొచ్చిన పంట ఎండిపోకూడదు. రైతుకు నష్టం, కష్టం రాకూడదు. రైతును ఆదుకోవాలనే ఆలోచనతో.. మార్కెట్లో ఎక్కడ, ఏ రేటుకు దొరికినా విద్యుత్‌ను కొనుగోలు చేసి రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు.
❇️ చలికాలం ప్రారంభానికి ముందే రిజర్వాయర్లు వట్టిపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి రిజర్వాయర్లలో 462 టీఎంసీల నీరుండగా, ఇప్పుడు 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు.
❇️ అందుబాటులో ఉన్న నీటిని రాబోయే జూన్ వరకు 8 నుంచి 10 నెలలు పొదుపుగా వాడుకోవాల్సిన అవసరముందన్నారు. తాగునీటికే కష్టమైన పరిస్థితులు ఉన్నాయని.. రాష్ట్రంలో 24 వేల గ్రామాలకు మంచినీటి సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
❇️ ఎల్‌నినో విపత్తుకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ఎవరూ వ్యాప్తి చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా 24 గంటల పాటు ప్రజలకు సరైన సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించామన్నారు. అపోహలు, తప్పుడు ప్రచారం కల్పించకుండా ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ఒక వార్ రూమ్‌ను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
❇️ ఈ విపత్తు పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారికంగా సమాచారం అందించడానికి సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావును నోడల్ అధికారిగా నియమించారు.