టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధన

భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌ విషయంలో BCCI కీలక ప్రకటన చేసింది. భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధానను BCCI నియమించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే BCCI స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేసింది.
2013 నుంచి భారత జట్టులో కొనసాగుతున్న మంధానకు ఇప్పటికే నాయకత్వ అనుభవం ఉంది. అలాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 2024, 2026 సీజన్లలో ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించింది.
మంధాన ఇప్పటివరకు 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించింది. ఇందులో 11 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
వన్డేల్లో మంధాన కెప్టెన్‌గా వ్యవహరించిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధించింది.
WPLలో RCBకి 35 మ్యాచ్‌ల్లో మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది.
ఈ నెలలో జింబాబ్వేతో స్వదేశంలో జరిగే టీ20, వన్డే సిరీస్‌లకు స్మృతి మంధానను కొత్త కెప్టెన్‌గా నియమించారు. టీ20ల్లో షెఫాలి వర్మ, వన్డేల్లో దీప్తి శర్మ వైస్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రెండు జట్లలోనూ హర్మన్‌ప్రీత్‌కు చోటు దక్కింది. రాయ్‌పుర్‌ వేదికగా ఈ నెల 16, 18, 20 తేదీల్లో టీ20 సిరీస్‌ జరుగుతుంది. 23, 25, 28 తేదీల్లో వడోదర వన్డే సిరీస్‌కు ఆతిథ్యమిస్తుంది.
Previous articleఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ