ఖమేనీ ఖతం.. అమెరికా లక్ష్యం నెరవేరేనా..?

అమెరికా౼ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో యుద్ధం మరింత తీవ్రమైంది. 37 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న ఖమేనీ సేవలను కోల్పోవడం ఇరాన్‌కు పెద్ద దెబ్బ. అయితే ఖమేనీ చనిపోయినా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆశిస్తున్నట్లుగా ఇరాన్‌లో ఇప్పటికిప్పుడు అధికార మార్పిడి అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. సుప్రీం లీడర్‌ లేకపోయినా పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉంది. కొత్త పాలకుడి నియామకం విషయంలో కూడా స్పష్టత ఉండడం ఓ కారణమని చెప్పొచ్చు.
సుప్రీం లీడర్‌ లేనప్పుడు ఇరాన్‌ పాలనా వ్యవహారాలను ముగ్గురు సభ్యులతో కూడిన లీడర్‌షిప్ కౌన్సిల్ చూసుకుంటుంది. ఇందులో దేశాధ్యక్షుడు, న్యాయ వ్యవస్థ అధిపతితో పాటు మరో సభ్యుడు భాగంగా ఉంటారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఈ మండలి చేతుల్లోకి ఇరాన్‌ పాలనా బాధ్యతలు వెళ్లాయి.
ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌ ఎవరు అన్న దానిపైనా ఉత్కంఠ నెలకొంది. ఈ నియామకాన్ని చేపట్టేందుకు 88 మంది షియా మతపెద్దలతో కూడిన కమిటీ ఉంటుంది. సుప్రీం లీడర్‌కు ఏమైనా జరిగినప్పుడు వీలైనంత త్వరగా కొత్త నాయకుడిని నియమించాల్సిన బాధ్యత ఈ కమిటీదేనని ఇరాన్‌ చట్టాలు చెబుతున్నాయి. ఇందులోని సభ్యులను ప్రత్యక్ష ప్రజా ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు. గెలిచినవారు 8 ఏళ్ల పాటు కమిటీలో ఉంటారు. మెజారిటీ ఓటింగ్‌ ద్వారా సుప్రీం లీడర్‌ను వీరు ఎన్నుకుంటారు. సుప్రీం లీడర్‌ను తొలగించే అధికారం కూడా ఈ కమిటీకి ఉంటుంది. అయితే ఇప్పటివరకూ అలాంటి తొలగింపు ఎన్నడూ చోటుచేసుకోలేదు.
ఖమేనీ కుమారులలో ఒకరైన 56 ఏళ్ల ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం దేశాధినేత అవుతారనే ప్రచారం జరుగుతోంది.
Previous articleఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరో..?