బెంగళూరు నగరంలో మహిళలపై వేధింపుల కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ ప్రముఖ టీవీ నటిని సోషల్ మీడియాలో లైంగికంగా వేధించినందుకు గాను అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 41ఏళ్ల నటి తెలుగు, కన్నడలో పలు టీవీ సీరియళ్లలో నటించింది. నవీన్ కె మోన్ అనే వ్యక్తి లండన్, పారిస్ వంటి నగరాల్లో కార్యాలయాలు ఉన్న ఓ గ్లోబల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
మూడు నెలల క్రితం నటికి నవీన్ ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దానిని నటి తిరస్కరించిడంతో మెసెంజర్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడం ప్రారంభించాడు. నటి బ్లాక్ చేసినా, కొత్త ఖాతాలు సృష్టించి వేధింపులు కొనసాగించాడు. అసభ్య సందేశాలతో పాటు నిందితుడు తన మర్మాంగాల వీడియోలను కూడా పంపినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 1న నిందితుడిని నేరుగా కలిసి హెచ్చరించినా వినకపోవడంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
వాకింగ్‌కు వెళ్లిన మరో మహిళకు వేధింపులు
బెంగళూరు నగరంలో మరో మహిళకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. శనివారం ఉదయం తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లిన 33 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు. వెనుక నుంచి మేడమ్ అని పిలిచి.. ఆమె వెనక్కి తిరగగానే దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.