జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై KCR సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారన్నారు BRS అధినేత కేసీఆర్. పార్టీ నేతలు ప్రజల దగ్గరికి వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం ఆగం అయ్యిందని, ఇక జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్టీ అభ్యర్ధి మాగంటి సునీత గోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి కేసీఆర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని KCR సూచించారు.
Previous articleఅన్ని చెక్ పోస్టులను తక్షణం మూసివేయాలి
Next articleవాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు