యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్‌లో మరో కీలక మార్పు రాబోతుంది. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే, పేటీఎం వంటి యాప్స్‌లో ఇక పిన్ ఎంటర్ చేయకుండానే పేమెంట్లు చేయగలిగే కొత్త సిస్టమ్ అందుబాటులోకి రానుంది. డిజిటల్ పేమెంట్స్‌కు ఇప్పటివరకు పిన్ ఎంటర్ చేస్తుండగా, ఇకపై ఫింగర్ ప్రింట్, ఫేషిషల్ రికగ్నిషన్‌తోనూ ట్రాన్సాక్షన్ పూర్తికానుంది. ఆధార్ కార్డులో నమోదైన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది.
పిన్ ఎంటర్ చేసే విధానంలో ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పోలిస్తే, కొత్త విధానం వల్ల భద్రత మరింత పెరగడమే కాకుండా.. ట్రాన్సాక్షన్ సమయం 25% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్ నమోదు చేయకుండానే ఫేస్ లేదా ఫింగర్ ప్రింట్ ఆధారంగా పేమెంట్ పూర్తిచేయొచ్చు. డిజిటల్ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం గ్రామీణుల్లో కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి.