వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పనులు మొదలైతే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ ఆలయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న మొక్కులు.. భీమన్నకు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రెండు రోజులు సమయం ఇస్తున్నామని ఆ లోపు ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఏం చేయాలో అది చేస్తామన్నారు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
త్వరలో సమక్క సారలమ్మ జాతర జరుగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. ఈ క్రమంలో భక్తులకు LED స్ర్కీన్‌లపై దర్శనం కల్పించనున్నట్లు దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి ప్రకటించారు. ఆలయ విస్తరణ, నిర్మాణ పనుల నేపథ్యంలో LED స్ర్కీన్‌లపై తాత్కాలిక ఏర్పాట్లతో భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు. అర్జిత సేవలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, మేడారం జాతర సమయంలో సమ్మక్క-సారలమ్మ దర్శనానికి ముందు, తర్వాత తాత్కాలిక ఏర్పాట్లతో దర్శన సౌకర్యం కల్పిస్తామన్నారు.