ట్రంప్ కల నెరవేరుతుందా..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా.. రాదా.. ఇదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒబామా అధ్యక్షుడైన కొన్ని నెలలకే నోబెల్ బహుమతి ఇచ్చారని, ఆయన దేశానికి ఏమీ చేయలేదని, పైగా దేశాన్ని నాశనం చేశారని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.
ఒబామాకు ఎందుకు బహుమతి ఇచ్చారో ఆయనకే తెలియదని… ఏమీ చేయనందుకే ఆయనకు నోబెల్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒబామా దేశాన్ని నాశనం చేయడం తప్ప చేసిందేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ఆరోపించారు.
తాను మాత్రం గాజాలో శాంతిని నెలకొల్పడంతో పాటు, ఏకంగా 8 యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదరడంలో తన పాత్ర ఉందని గుర్తుచేశారు. అయితే తాను ఈ పనులన్నీ అవార్డు కోసం చేయలేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. శాంతి బహుమతి విషయంలో నోబెల్ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదన్నారు.
2009లో ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన 8 నెలలకే నోబెల్ శాంతి బహుమతి పొందడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇది చాలా తొందరపాటు చర్య అని, నోబెల్ పురస్కారానికి మరింత ఉన్నత ప్రమాణాలు ఉండాలని కామెంట్స్ చేశారు.
నోబెల్ శాంతి బహుమతి రాకపోతే అది అమెరికాకే అవమానం అని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. మరి నోబెల్ విషయంలో ట్రంప్ ప్రయత్నాలు ఫలిస్తాయా.. లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Previous articleTG: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉత్కంఠ
Next articleజూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్