తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ల జీవోతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పాతపద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. జీవో 9ని అమలు చేయాలని కోరనుంది.
సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీలతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు.