తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వీఆర్వోల వద్ద రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్నారు. సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు.
కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి పెరిగడంతో ఏసీబీ దాడుల్లో భారీగా డబ్బు బయటపడుతుంది. కీసర ఎమ్మార్వో ఘటన, షేక్ పేట ఎమ్మార్వో సుజాత, ఆ మధ్య సజీవ దహనం అయిన ఎమ్మార్వో విజయారెడ్డి ఘటనలు చూస్తే వీటి వెనుక ఆర్థిక లావాదేవీలు, లంచాల వ్యవహారాలే కీలకంగా ఉన్నాయి.
అంతేకాదు రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఏ పని జరగాలన్నా వీఆర్వోనే కీలకం. 95 రకాల విధులు వీఆర్వో నిర్వర్తిస్తుంటారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా వీఆర్వో దగ్గరుండి చూడాలి. గ్రామస్థులు దగ్గరుండి మరీ వీఆర్వో పనిచేస్తారు. వీఆర్వో సంతకం చేస్తేనే సర్టిఫికెట్లు జారీ అవుతాయి. అయితే ఈ పనులు చేసేందుకు వీఆర్వోలు లంచాలకు అలవాటు పడ్డారనే ఆరోపణలున్నాయి. వారి జీతాల కంటే ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆ వ్యవస్థను రద్దు చేసి వ్యవస్థ పేరు కూడా మార్చాలని నిర్ణయించారు. కొత్తగా అదనపు బాధ్యతలు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 7172 మంది వీఆర్వో పోస్టులు ఉండగా..అందులో ఐదువేలమంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.