తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ జారీపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అయితే ఆ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా మరికొందరు బీసీ నేతలు ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50 శాతానికి మించరాదన్నారు. విద్య, ఉద్యోగాల్లో 50 శాతం దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని వాదించారు. ఏజెన్సీల్లో ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ల సీలింగ్ వర్తించదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోకూడదనే తీర్పులు ఉన్నాయన్నారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు 9పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వకపోడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయం పై ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం SEC రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.