సోమేశ్‌కుమార్‌ పదవీ కాలం ముగియకముందే.. తెలంగాణకు కొత్త CS ఎందుకు..?

0
తెలంగాణ కొత్త CS (Chief Secretary)గా శాంతి కుమారి నియమితులయ్యారు. 1989 IAS బ్యాచ్‌కు చెందిన ఆమె.. ప్రస్తుతం అట‌వీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శిగా ఉన్నారు. గ‌తంలో వైద్యారోగ్య శాఖ బాధ్యత‌ల‌ను నిర్వర్తించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో మెద‌క్ క‌లెక్టర్‌గా కూడా శాంతి కుమారి పని చేశారు. CSగా శాంతి కుమారి 2025, ఏప్రిల్ వ‌ర‌కు కొనసాగుతారు. తెలంగాణ తొలి మ‌హిళా సీఎస్‌గా శాంతి కుమారి రికార్డు సృష్టించారు.

మూడేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)గా కొనసాగుతున్న సోమేశ్‌కుమార్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వెళ్లాలని నిన్న తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆ వెంటనే DoPT కూడా సోమేశ్‌కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని.. రేపటి (12వ తేదీ)లోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రేపు సోమేశ్‌కుమార్‌ రిపోర్ట్ చేస్తారా.. లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ DoPT 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. IAS క్యాడర్‌ రూల్స్‌కు విరుద్ధంగా క్యాట్‌ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడం చెల్లదని సొలిసిటర్‌ జనరల్‌ వాదించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleMy Village Showకు గెస్ట్‌గా.. మంత్రి కేటీఆర్ ట్వీట్
Next articleఆ రోజే “వారాహి” వాహనానికి పూజ.. కీలక ప్రకటన చేసిన జనసేన