డిజిటల్ యుగంలో డేటా దుర్వినియోగం అనేది తీవ్రమైన పెను ముప్పుగా మారింది. సమాచారాన్ని తమ ఆయుధంలాగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు, నేరాలకు పాల్పడుతున్నారు. ‘ఇంటర్‌నెట్‌లో ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే ఉచితంగా కంటెంట్ వస్తుంది. ఎలాంటి లింకునైనా ఓపెన్ చేస్తా. ఎంచక్కా ఎంజాయ్ చేస్తా.’ అంటే భవిష్యత్‌లో ఎదురయ్యే పరిణామాలను మీరు తప్పక అనుభవించాల్సి వస్తుంది.
వ్యక్తిగత డేటా.. డబ్బుకంటే విలువైనది. ఒక్కసారి అది దుర్వినియోగానికి గురైతే, తిరిగి తెచ్చుకోవడం దాదాపు అసాధ్యమే. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. డేటా విషయంలో తప్పు జరిగిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం కష్టంతో కూడుకున్న పని.
ఆన్‌లైన్ అంగట్లో వ్యక్తిగత డేటాకు విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు పలు మార్గాల్లో మన డేటాను తస్కరించి.. నెట్టింట చీకటి ప్రపంచమైన డార్క్ వెబ్లో అమ్మేస్తున్నారు. అక్కడికి వెళ్లిన డేటా ఎక్కడికి చేరుతుందో… ఎవరి చేతుల్లో పడుతుందో… మనకు తెలియదు.
సినిమా పైరసీ సైట్లు, ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారంలలోనే ఎక్కువగా డేటా తస్కరణకు గురవుతోంది. ఉచిత సినిమాలు… ఉచిత గేమ్స్… బోనస్‌లు… ఇవన్నీ కేవలం డేటాను దోచుకునేందుకు వేసిన ఉచ్చులే. ఈ ఉచ్చుల్లో చిక్కుకుంటే మనకు తెలియకుండా మాల్వేర్ ద్వారా మొబైళ్ల నుంచి ఫోటోలు, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, OTPలు అన్ని తస్కరణకు గురవుతాయి.
తస్కరణకు గురైన డేటాను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు.. మీకు ఫేక్ లింకులు పంపుతారు, ప్రలోభపెట్టే కాల్స్ చేస్తారు. ఖాతాలు హ్యాక్ చేస్తారు. బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతారు. డబ్బులు గుల్ల చేస్తారు. డిజిటల్ అరెస్ట్‌లు అంటూ వ్యక్తిగతంగా వేధింపులకు దిగుతారు. ఒక్క క్లిక్‌తోనే మీ మొబైల్‌ను టార్గెట్ చేస్తారు.
అనుమానాస్పదమైన సైట్లు, యాప్స్… ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. ‘Free movies’, ‘Free downloads’, ‘Free games’ — ఇవన్నీ ప్రమాద సంకేతాలు. ఉచితం అనిపించే ఈ కంటెంట్.. మీకు తాత్కాలిక ఎంజాయ్ ఇచ్చినా… భవిష్యత్తులో జీవితాంతం నష్టాన్ని మిగిల్చే ప్రమాదం పొంచి ఉంది.
మీ డేటా- మీ భద్రత. నమ్మదగిన వెబ్‌సైట్లనే వినియోగించండి. అపరిచిత లింక్‌లు ఓపెన్ చేయొద్దు. మీ ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోండి. అనుమానాస్పద యాప్స్‌ను వెంటనే డిలీట్ చేయండి.
డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఒక ఆప్షన్ కాదు… మీ భద్రతకు తప్పనిసరి! మీ డేటా… మీ జీవితానికి సంబంధించిన అంశం. దాన్ని మీరు కాపాడుకోకపోతే మరెవ్వరూ కాపాడలేరు.