మరోసారి TGSRTC ఛార్జీలను పెంచింది. అయితే ఈసారి ఈ పెంపు తెలంగాణ వ్యాప్తంగా కాకుండా హైదరాబాద్‌కే పరిమితం చేసింది. జంట నగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని TGSRTC నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఈ -ఆర్డినరీ, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5 చొప్పున పెంచనున్నారు. నాలుగో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. రేపటి నుంచి పెంపు అమల్లోకి రానుంది.
నగరంలో దశల వారీగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల రాబోయే రెండేళ్లలో 2 వేల 800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశ పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందని.. అందుకు ప్రజలు సహకరించాలని TGSRTC కోరింది.