సచివాలయం కింద నిజాం ఖజానా.. అందుకే కూల్చివేస్తున్నారన్న రేవంత్ రెడ్డి

1
సచివాలయ కూల్చివేత సహా సీఎం కేసీఆర్ అదృశ్యంపై ఎంపీ రేవంత్ రెడ్డి తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. నిధుల కోసమే సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ ఆరోపించారు. దీనిపై తమకు అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు. సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటినుంచే కేసీఆర్ అదృశ్యమయ్యారని..ఇది యాదృచ్ఛికమో, వ్యూహాత్మకమో తెలియడంలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.
జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పలు పత్రికలు ప్రచురించాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నిజాం నిధులు నేలమాలిగల్లో దాచుకున్నాడని నివేదికలు కూడా ఉన్నాయిని..మింట్ కాంపౌండ్, విద్యారణ్య స్కూల్ ఆవరణ, హోమ్ సైన్స్ కాలేజ్‌లో గతంలో సొరంగాలు బయటపడ్డాయని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆ సొరంగాల కేంద్రం జి బ్లాక్ కిందకు ఉన్నాయని అప్పట్లో పురావస్తు శాఖ గుర్తించిందన్నారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని రేవంత్ తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని అన్నారు.
పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఎందుకు తవ్వకాలు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. పొక్రాన్ అణు పరీక్షలు కూడా ఇంత రహస్యంగా జరపలేదన్నారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద ఎన్ఎండీసీ, పురావస్తు శాఖ చేత పరిశోధన జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కూడా వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారారు.
Previous articleఆ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా.. అత్యద్భుమైన మ్యాచ్ మాత్రం చూశారు
Next articleతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ ఫోన్..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here