లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఘంటేవాలా స్వీట్ షాపుకి వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. రాహుల్ పెళ్లి కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామన్న షాప్ ఓనర్.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
నెహ్రూ-గాంధీ కుటుంబం ఇప్పటికీ ఈ షాప్ నుంచే స్వీట్లను కొనుగోలు చేస్తుంటుంది. నెహ్రూ- గాంధీ కుటుంబానికి నాలుగు తరాలుగా సేవలను అందిస్తోంది. తన కుటుంబంతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఉన్నందున రాహుల్ గాంధీ.. ఈ షాప్‌కి వెళ్లారు. దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపారు.
నార్త్‌లో మంచి డిమాండ్ ఉండే స్వీట్ ఐటమ్ ఇమర్తీతో పాటు జిలేబీ, బేసన్ లడ్డూలు తయారు చేయడానికి ప్రయత్నించారు రాహుల్ గాంధీ.
రాజీవ్ గాంధీ- సోనియా, ప్రియాంకా గాంధీ- రాబర్ట్ వాద్రా వివాహాలకు తామే స్వీట్లు పంపించినట్లు షాప్ ఓనర్ జైన్ గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ- సోనియా వివాహ ఆహ్వాన పత్రిక కూడా తనకు అందిందని చెప్పారు. ఈ వెడ్డింగ్ కార్డ్ ఫ్రేమ్ కట్టి గోడకు పెట్టామని.. గాంధీ కుటుంబ సభ్యులతో తన పూర్వీకులు దిగిన ఫొటోలను కూడా ఆయన రాహుల్ గాంధీకి చూపించారు.