ఎన్నో ఏళ్ల ఎదరుచూపులకు..ఎంతోమంది త్యాగాలకు, లక్షలమంది కన్నీళ్లకు ఒక్క సంతకంతో ఫుల్ స్టాప్ పెట్టిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ..తెలంగాణ ప్రత్యేక రాష్ట ఏర్పాటు బిల్లుపై సంతకం పెట్టిన రాష్ట్రపతి ఆయన. 3కోట్ల మంది పెదవులపై చిరునవ్వులకు కారణమైన మహోన్నత వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కల సాకారం దిశగా అప్పటి రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ చేసిన సంతకం చరిత్రలో నిలిచిపోయింది.
60ఏళ్లుగా సాగిన తెలంగాణ ఉద్యమాన్ని అన్ని కోణాల నుంచి చూసిన ప్రణబ్ కేంద్ర మంత్రిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం నియమించిన కమిటీకి నాయకత్వం వహించారు. అనంతరం రాష్ట్రపతి హోదాలో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014పై మార్చి ఒకటిన ప్రణబ్ సంతకం చేశారు. ఆయన సంతకం చేసిన మరుసటిరోజే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయన పెట్టిన సంతకంతోనే జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది.
యూపీఏ-2 ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ అనేకమార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన చర్చోపచర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్-9న వచ్చిన తొలి ప్రకటన సమయంలోనూ ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు. ప్రణబ్‌తోపాటు అప్పటి ముఖ్యనేతలు చిదంబరం, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేశ్‌ల సూచనల మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఆ ప్రకటనపై సీమాంధ్ర నుంచి వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో కేంద్రం వెనుకంజ వేసినా, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల అభిప్రాయాల సేకరణలో ఆర్థికమంత్రిగా ప్రణబ్ కీలకంగా వ్యవహరించారు.
2012లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక సైతం అనేకమార్లు తెలంగాణ ఏర్పాటుపై వచ్చిన వినతులకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ వచ్చారు. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2014 ఆమోదం పొందిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీల ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసి రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని కోరారు. అయితే అవన్నింటిని పట్టించుకోలేదు ప్రణబ్.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ను ప్రగతిశీల నగరంగా అభివృద్ధి చేసుకోండి, పెట్టుబడులను ఆకర్షించి ఉన్నత లక్ష్యాలను చేరుకోండి అని ప్రణబ్ సూచించారు. ఇక 2017లో ప్రణబ్ రాసిన పుస్తకం ది కొయలిషన్ ఇయర్స్ పుస్తకంలోనూ తెలంగాణ, కేసీఆర్ అంశాలను ప్రణబ్ ప్రస్తావించారు. ఎన్నో శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్.. ఆధునిక యుగంలో హైటెక్‌సిటీగా, సైబర్ సిటీగా రూపుదిద్దుకున్నది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్నది. విభిన్న సంస్కృతుల సమ్మేళనం ఇక్కడి ప్రజలు. ఆధునిక నాగరికత కేంద్రం. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ నగరమంటే తెలుగువారికే కాదు..దేశానికీ ఇష్టమే అంటూ ప్రణబ్ ముఖర్జీ కితాబిచ్చారు.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.