Pawan Kalyan: రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్..

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని AP డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు.
AP ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కొండగట్టులో పవన్ కల్యాణ్ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు చెప్పారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
TTD సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కల్యాణ్ ప్రతిపాదనలు చేశారు. AP CM చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. CM కూడా సానుకూలంగా స్పందించారు. పవన్ ఈ విషయంపై TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడితోనూ చర్చించారు. TTD బోర్డు రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు.
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవల తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.
Previous articleCM Revanth Reddy: ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
Next articleKavitha: సీఎం రేవంత్ రెడ్డికి కవిత వార్నింగ్