మాకు అధికారం కావాలి.. నీకు ఏం కావాలి.. కేంద్రమంత్రి పదవి..అవునా అయితే మాతో కలువు..నీకు పదవి ఇస్తాం..మేం అక్కడ అధికారం చేపడతాం. అలా అయితే నాకు ఒకే..ఇది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా – బిజేపీ మధ్య జరిగిన ముచ్చట.
జ్యోతిరాదిత్య సింధియా.. ఈ ఒక్క పేరే ప్రస్తుతం కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు రుచి చూపించడానికి తీవ్రంగా కృషి చేసిన సింధియా.. ఇప్పుడు అదే ప్రభుత్వాన్ని సంక్షోభంలో పడేయడంలోనూ కీలకపాత్ర పోషించారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబావుటా ఎగరేసిన 17 మంది ఎమ్మెల్యేలకు క్యాంపు నిర్వహిస్తూ..కాంగ్రెస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేశారు సింధియా.
18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా ఉన్న తాను ఇప్పుడు పార్టీని వీడాల్సిన సమయం వచ్చిందని సోనియాకు పంపిన రాజీనామ లేఖలో సింధియా పేర్కొన్నారు. రాష్ట్రానికి, దేశానికి సేవలందించాలన్నదే మొదట్నించీ తన కోరిక అని, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పని చేయలేకపోతున్నానని ఆయన అన్నారు. ప్రజల ఆకాంక్షలు, కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలంటే మరోసారి కొత్తగా తమ పయనం ప్రారంభించాలని నిశ్చయించుకున్నానని చెప్పారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ముసలం పుట్టించిన జ్యోతిరాదిత్య సింధియాకు బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సింధియాకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్రమంత్రి పదవిని కూడా ఆఫర్ చేస్తోంది బీజేపీ. దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చించారు కూడా. ఇప్పటికే సింధియా వర్గం ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఓ రిసార్టులో సేదతీరుతున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com