నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి పొడిగించింది. ఎన్నిక ప్రక్రియ గతంలోనే ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా ముందుకు సాగలేదు. గతంలోనే ఎన్నికల ప్రక్రియను పొడిగించిన ఎన్నికల సంఘం మరో 45 రోజుల పాటు ప్రక్రియను పొడిగించినట్లు ప్రకటించింది.
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 12న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 7వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక ప్రక్రియను పొడిగించింది. పొడిగింపు గడువు ముగియనుండటంతో మరోసారి 45 రోజులపాటు గడువును పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయంతో ఆగష్టు మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. TRS నుంచి మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తూ అప్పటి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం తీసుకున్నారు. TRS తరఫున ఎన్నికైన భూపతిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనర్హతపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఛైర్మన్ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com