ప్రధాని మోదీ ఈ నెల 16న కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయా పనులను సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండియన్ పర్యవేక్షిస్తున్నారు.
ఓర్వకల్లు మండలం నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలోని రాగమయూరిలో 400 ఎకరాల విస్తీర్ణంలో సభ నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఇందులో 40 ఎకరాల విస్తీర్ణంలో వర్షం వచ్చినా ఆటంకం కలగకుండా సభా వేదిక నిర్మిస్తున్నారు. 12 పార్కింగ్ ప్రదేశాలకు 347 ఎకరాలు కేటాయించారు. సభ జరిగే ప్రాంతంలో ఐదు హెలిప్యాడ్లు నిర్మిస్తున్నారు. సుమారు వంద సీసీ కెమెరాలతో నిఘాతో పాటు 37 మంది డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మొత్తం 7,230 మంది పోలీసు సిబ్బందిని నియోగించనున్నారు.
ఈనెల 16న ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 7:50 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరుతారు ప్రధాని మోదీ. 16న ఉదయం 10:20 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అనంతరం హెలికాఫ్టర్‌లో సున్నిపెంటకు వెళ్తారు.
అక్కడి నుంచి ఉదయం 11:10 గంటలకు రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కి చేరుకోనున్నారు ప్రధాని. ఉదయం 11:45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2:30 గంటలకు రాగ మయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అనంతరం కర్నూలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు.