ఒంటరి పోరుకు సిద్ధమైన MIM.. నష్టం ఎవరికో..?

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రతిపక్ష కూటమిలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలోనే ఒంటరిగా బరిలోకి దిగాలని MIM నిర్ణయించింది.
బిహార్‌లో NDA, మహాఘట్‌బంధన్ కూటములకు ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిగా ఎదగడమే తమ లక్ష్యమని MIM నేతలు స్పష్టం చేశారు. తమ సత్తాను ప్రత్యర్థులకు చూపిస్తామంటున్నారు.
పొత్తు కోసం RJD నేతలు లాలూప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్‌లకు లేఖ రాసినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని.. అందుకే 100 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని MIM ప్రకటించింది. మిగిలిన పార్టీలతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తున్నామని, త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో MIM ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు RJDలో చేరిపోయారు. బిహార్‌లో 17 శాతానికి పైగా ఉన్న ముస్లిం జనాభానే లక్ష్యంగా చేసుకుని MIM వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈసారి MIM ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.
బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే CEC షెడ్యూల్ రిలీజ్ చేసింది. నవంబర్ 6న తొలి విడత, 11న రెండో విడత పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక ఎంఐఎం ఒంటరి పోరుతో బీజేపీకే లాభమని చెప్తున్నారు.
Previous articleహైకోర్టు స్టేపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
Next articleవేములవాడలో దర్శనాల్లో తాత్కాలిక మార్పులు