ఐపీఎల్ (IPL) 2026 మినీ ఆక్షన్ ఇండియాలోనే జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే ఈసారి కూడా విదేశాల్లోనే ఆక్షన్ ప్రక్రియ నిర్వహించాలని BCCI డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. విదేశాల్లో ఆక్షన్ నిర్వహించడం వరుసగా ఇది మూడో ఏడాది. 2023లో దుబాయ్‌లో, 2024లో జెడ్డాలో నిర్వహించారు.
IPL ఆక్షన్ డిసెంబర్ 15 లేదా 16న అబుదాబిలో జరిగే అవకాశముంది. మరో రెండు రోజుల్లో (నవంబర్ 15లోపు) అన్ని ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే, రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐ (BCCI)కి ఇవ్వాల్సి ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసి.. రాజస్థాన్ నుంచి సంజు శాంసన్‌ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ముంబై ఇండియన్స్ (MI)ని వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. అర్జున్ లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరతాడని సమాచారం. బదులుగా లక్నో టీమ్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలిసింది.
2023లో ముంబై (MI) తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు వికెట్లు తీశాడు. 2023లో 4, 2024లో ఒక మ్యాచ్ ఆడాడు.
2025 మెగా వేలంలో ముంబై అర్జున్‌ను అతని బేస్ ధర రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 2025 మెగా వేలంలో శార్దూల్ ఠాకూర్ అన్‌సోల్డ్‌గా మిగిలాడు. అయితే, మోసిన్ ఖాన్ గాయపడటంతో శార్దూల్‌ను అతని కనీస ధర రూ.2 కోట్లకు లక్నో తీసుకుంది. గత సీజన్‌లో ఇతను 10 ఇన్నింగ్స్‌ల్లో 13 వికెట్లు తీశాడు.