సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. దశాబ్దాల క్రితం నాటి ఈ ప్రాంగణ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.101 కోట్లు మంజూరు చేయగా రోడ్లు, భవనాల శాఖ అక్టోబరు మొదటివారంలో పనులు ప్రారంభించింది. ప్రస్తుతం మహాజాతర సమీపిస్తుండటం, ఇప్పటికే భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. జనవరి 5 నాటికి పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు.
గత నెల 24న పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తి చేశారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలను యథావిధిగా కొనసాగిస్తూ మార్పులు, చేర్పులు చేపడుతున్నారు.
ప్రాంగణానికి ఎనిమిది ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా 16 రాతి పిల్లర్లను నిలబెట్టారు. చిన్న పిల్లర్లపై బీములు అమర్చే పనులు ప్రారంభించారు. ఈ పనులు కూడా ఈనెల 5 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
గద్దెల పునర్నిర్మాణం పనులు పూర్తయిన వెంటనే మేడారానికి రావాలనే ఆలోచనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్లు తెలిసింది. యంత్రాంగం జనవరి 5 నాటికి పూర్తి చేస్తే 6 లేదా 10న ముఖ్యమంత్రి పర్యటన ఉండే అవకాశముందని తెలిసింది.