నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు.. జనం గుండెల్లో నుంచి పుడతారనడానికి నిలువెత్తు నిదర్శనం YSR. రాజన్న అని పిలుస్తే చాలు ఆత్మీయంగా పలికే ఆత్మబంధువు ఆయన. విశ్వసనీయతకు, పరిపాలన దక్షతకు, ప్రజాసంక్షేమానికి ఆయన దిక్సూచిలా నిలిచారు. లీడర్‌గా వచ్చి హీరోగా ఎదిగారు. ఒక సీఎంను కోట్లాది మంది ప్రజలు ఆప్తుడిగా భావించిన ఘనత ఆయనకే దక్కింది.
బడుగు జీవులకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీలో, కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లైన నిరుపేదల ఫీజురీయింబర్స్‌మెంట్ అనుభవాల్లో పెద్దాయనే కనిపిస్తారు. అచ్చ తెలుగు పంచకట్టు, ఆత్మీయ పలకరింపు, అన్నింటికి మించి ఆ చిరునవ్వు YSను ప్రజల మనిషిని చేశాయి. ఒక్క మాటతో రాష్ట్ర సమస్యలకు, ఒక్క సంతకంతో అన్నదాతల ఇబ్బందులకు చెక్ పెట్టిన మహానేత YSR.
ఉమ్మడి ఏపీ ప్రజలు కరువుతో అల్లాడిపోతున్న రోజులవి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పాలకులు పట్టించుకోని రోజులవి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నేనున్నాంటూ భరోసానిస్తూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు YSR. పల్లెపల్లెను పలకరించారు. గుడిసె గుడిసెలోని గుండెను తట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యంగా సాగిన యాత్ర.. ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. చేవేళ్లలో ప్రారంభమైన ఆ యాత్ర సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఏదైన ఆరోగ్య సమస్య వస్తే చాలు పేదవారి బతుకులు కుదేలైపోతాయి. అందుకే వారి కోసం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి కార్పొరేట్ వైద్యం అందించారు. దీని ద్వారా ఎంతో మందికి పునర్జన్మ లభించింది. అందుకే వారందరు ఆయనను ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు.
ఎన్నో ఒడిదొడుకులెదుర్కొని, తనను నమ్మిన ప్రజల కష్టాలు తీర్చిన మహానేత YSRకు 71వ జయంతి సందర్భంగా NewsBuz ఘన నివాళి.