కాశీబుగ్గ ఘటనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మంత్రి లోకేష్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానిక అధికారులు, పోలీసులు, ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం పలాస పీహెచ్‌సీకి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించి, వారికి అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం చెప్పారు.
కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర జరిగిన తోపులాట చాలా బాధాకరమన్నారు మంత్రి లోకేష్. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చారన్నారు. అక్కడ ఆలయ ప్రవేశమార్గం దగ్గర తోపులాట జరిగి 9 మంది చనిపోయారని.. మరో 16 మంది గాయపడ్డారన్నారు. ముగ్గురిని స్పెషాలిటీ కేర్ కోసం శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రికి తరలించారన్నారు. 94 ఏళ్ల భక్తుడు పాండా ప్రజల కోసం సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారని చెప్పారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో కాశీబుగ్గ ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు లోకేష్. తీవ్రంగా గాయపడిన వారికి రూ.3 లక్షలు ఇస్తామన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని కార్యాలయానికి తెలియజేశామన్నారు. ప్రధాని మోదీ కూడా చనిపోయిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు సాయం అందిస్తామని చెప్పారని.. చనిపోయిన వారిలో ముగ్గురు టీడీపీ సభ్యులు ఉన్నారని స్పష్టం చేశారు. మా ప్రమాద బీమా కార్యక్రమం ద్వారా వారికి పార్టీ నుంచి రూ.5 లక్షలు అందిస్తామన్నారు.
Previous articleఇద్దరిని పిలిచి మాట్లాడాలన్న సీఎం.. నివేదికపై ఉత్కంఠ
Next articleACHIYYAMMA: పెద్ది మూవీ నుంచి మరో రెండు